Kapu leader Mudragada has not made any comment on the decission taken by Andhra Pradesh CM Nar Chandrababu naidu's government on 5 percent qouta for Kapus
కాపులకు విద్య, ఉద్యోగాల్లో ఐదు శాతం రిజర్వే,న్లు కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ శాసనసభ శనివారం బిల్లును ఆమోదించింది. దాన్ని ఆమోదం కోసం రాష్ట్రపతికి పంపించనున్నారు. అయితే, కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన చర్యలను అధికార తెలుగుదేశం పార్టీ హర్షం వ్యక్తం చేస్తోంది. అయితే, తెలుగుదేశం పార్టీకి చెందనివారు, కాపు నేత ముద్రగడ పద్మనాభం వర్గీయులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కేంద్రంపై నెపాన్ని నెట్టేందుకు మాత్రమే చంద్రబాబు చర్యలు చేపట్టారని, కాపులకు చంద్రబాబు చెప్పిన పద్ధతలో రిజర్వేషన్లు అమలు చేయడం అయ్యే పని కాదని అంటున్నారు.
రిజర్వేషన్లపై కాపులను చంద్రబాబు మరోసారి మోసం చేస్తున్నారని కాపు జేఏసీ ప్రధాన కార్యదర్శి కటారి అప్పారావు వ్యాఖ్యానించారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి ఇప్పుడు అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెడతామని కొత్త నాటకానికి తెరలేపారని ఆయన మండిపడ్డారు. కాపు రిజర్వేషన్లపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని అన్నారు.
రిజర్వేషన్లపై తీర్మానాన్ని కేంద్రానికి పంపడమంటే ఈ అంశాన్ని కోల్డ్‌స్టోరేజీలో పెట్టడమేనని కటారి అప్పారావు విమర్శించారు. చంద్రబాబు తీరుకు వ్యతిరేకంగా మళ్లీ ఉద్యమబాట పడతామని, కాపులకు రిజర్వేషన్లు ఇచ్చేవరకు వెనుకకు తగ్గబోమని కటారి అప్పారావు అన్నారు.